డి వి వి ఎస్ వర్మ పరిచయం 
జననం 1946 జూలై 1, పశ్చిమ గోదావరి జిల్లా    జంగారెడ్డిగూడెం. అక్కడే హైస్కూల్ చదువు. ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీలో బి ఎస్ సి డిగ్రీ. విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1966 విశాఖ ఉక్కు ఉద్యమ నేపథ్యంలో గుంటూరులో జరిగిన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర అధ్యక్షులుగా సురవరం సుధాకర రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా వర్మ ఎన్నికయ్యారు. 
1967 లో బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన ప్రపంచ యువజనోత్సవాలలో పాల్గొన్నారు. 1970-71 లో 10 నెలలు సామాజిక రంగ అధ్యయనానికి మాస్కోలో  ఉన్నారు. 
1971లో తన ఉద్యమ సహచరి మనోరమను వివాహం చేసుకున్నారు.
1971 నుండి పశ్చిమ గోదావరి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల పాత్ర పోషించారు. 9  సంవత్సరాలు జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా, 6 సంవత్సరాలు జిల్లా పార్టీ కార్యదర్శిగా వున్నారు. 1968 నుండి రాష్ట్ర సమితి సభ్యులుగా, 1986 నుండి కార్యవర్గ సభ్యులుగా వున్నారు. 1964 లో పార్టీ లో చేరిన వర్మ 1995 లో తన సభ్యత్వాన్ని ఐచ్ఛికంగా వదులుకున్నారు.
జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు  ఆయన  రూపకర్తగా, సారధిగా వున్నారు. సామూహిక మరుగు దొడ్ల స్థానంలో కుటుంబాలకు వ్యక్తిగత  మరుగుదొడ్లు నిర్మించాలనే ఉద్యమం నిర్వహించారు. దాదాపు 40 వేల వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం జరిగి అదే రాష్ట్రానికి దారి అయ్యింది. 
అటవీ బంజర్లలో ప్రజల భాగస్వామ్యంతో  మొక్కలు పెంచుకునే పథకం ఇక్కడ జరిగిన ఉద్యమంతోనే మొదలైంది. వేలాదిమంది పేదలు బంజర్లను  ఆక్రమించారు, వందలాదిమంది అరెస్టులయ్యారు. అంతిమంగా జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని నిరంతరాయంగా  మూడు రోజుల దిగ్బంధం తర్వాత ఈ పథకం రూపుదిద్దుకుంది. 
రైతుల ఐక్య వేదికగా ఏర్పడిన రైతు కార్యాచరణ సమితి కి ఆది నుండీ   ఉద్యమ సమన్వయ కర్తగా  వున్నారు. రైతు గర్జన, గ్రామీణ ప్రాంతాల బందు, వాగ్దానాల నిమజ్జనం వంటి వినూత్న కారక్రమాలతో  మురుగు కాల్వల తవ్వకాల కోసం సాగిన ఉద్యమం విజయం సాధించింది. 
పశ్చిమ గోదావరి జిల్లా అక్షరాస్యత ఉద్యమం జాతీయ స్థాయిలో  అవార్డు పొందడంలో, తణుకులో అక్షర యజ్ఞం కార్యక్రమానికి కో ఆర్డినేటర్ గా అది రాష్ట్ర స్థాయి అవార్డు పొందడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అక్షర మహిళ కార్యక్రమానికి చదువు, రాత పుస్తకాలను, వాలంటీర్ల శిక్షణా కరదీపికలు, నూతన అభ్యాసకుల కోసం  ప్రత్యేక పుస్తకాలను రాశారు.	
2001లో లోక్ సత్తా ఉద్యమ సంస్థ ప్రధాన కార్యదర్శిగా దానిని ప్రజా ఉద్యమాల బాట పట్టించారు.  క్రియాశీల పౌరుల శిక్షణకు కరదీపికను రాశారు.  60 వేల మందికి శిక్షణ ఇచ్చిన  వివిధ కార్యక్రమాలకు నాయకత్వాన్ని అందించారు. స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం కోటి సంతకాల సేకరణ, సమాచార హక్కు కోసం ప్రజా సమీకరణ, సురాజ్య ఉద్యమ కార్యకలాపాలకు రూపకల్పన చేశారు. 2006 లో లోక్ సత్తా పార్టీ ఏర్పడినప్పుడు దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీకి  ప్రజాస్వామ్య సంస్కరణల సిద్ధాంత పునాదిని కల్పించడానికి "నూతన రాజకీయ సంస్కృతి", "ప్రజలే ప్రభువులు" అన్న పుస్తకాలను, కార్యకర్తల శిక్షణ కోసం ఒక మాన్యువల్  ను ప్రచురించారు. మద్య నియంత్రణ కోసం, రాష్ట్ర   విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం పలు ప్రజా కార్యకలాపాలను నిర్వహింపజేశారు. 2017 నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా వున్నారు. 
భావజాల పరంగా ఆయన మార్క్సిస్టు. తణుకు లో  మార్క్స్, ఎంగెల్స్ ల రచనల పై అధ్యయన తరగతులు, చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం "జాతీయ స్ఫూర్తి" పత్రికకు సంపాదకులుగా వున్నారు. వర్తమాన  రాజకీయ పరిణామాల విశ్లేషణకు మార్క్సిజానికి కొనసాగింపుగా కొత్త చూపునిచ్చే ఆంటోనియో గ్రాంసీ భావజాలాన్ని ప్రచారంలోకి తెచ్చారు. జాతీయ స్ఫూర్తి ప్రచురించిన గ్రాంసీ ప్రత్యేక సంచిక అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రాంసీ దృక్కోణంలో  ఆయన రాసిన "ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోగాలు" అన్న పుస్తకం  అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి చొరవ  ఫలితంగానే  ఇప్పుడు అన్ని ప్రజా ఉద్యమ స్రవంతులలో గ్రాంసీ భావజాలం  చర్చనీయ అంశం అయ్యింది. 
డి వి వి ఎస్ వర్మ గారిలో ఒక కొత్త చూపు ఉంటుంది. ఒక కొత్త కోణం వుంటుంది. అది కొత్త దారిని చూపిస్తుంది. అయన పుస్తకాలను, కొన్ని వ్యాసాలను,  సంపాదకత్వం వహిస్తున్న జాతీయ స్ఫూర్తి పత్రికలను  అందరికీ  అందుబాటులో ఉంచాలని చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆహ్వానిస్తారని భావిస్తున్నాం.
	Contact: +91 85006 78977